Thursday, July 30, 2026

Buy now

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ హేమంత్ సహదేవరావు

* చీకుపల్లి–పెద్దగొల్లగూడెం ఇసుక వాగు డైవర్షన్ రోడ్డును పరిశీలించిన కలెక్టర్.. ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణకు ఆదేశాలు

ములుగు: వాజేడు మండలంలోని చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతినడంతో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రభావాన్ని అంచనా వేసి ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇసుక వాగులో వరద ఉద్ధృతి పెరగడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు దెబ్బతింది. దీంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి–163పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరద ప్రవాహం తగ్గిన వెంటనే ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్ధరించి రాకపోకలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ప్రస్తుతం వరద ఉధృతి అధికంగా ఉండటంతో డైవర్షన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వలు తవ్వి నీటిని మళ్లిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పైపులు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నామని, వరద ప్రవాహం తగ్గిన వెంటనే రహదారిని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కొండా కృపాకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular