* వైటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం.. బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు,గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి దేవస్థానం (వైటీడీ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) భవాని శంకర్ సంజయ్ జాజుతో ప్రమాణ స్వీకారం చేయించి ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా బాధ్యతలను అధికారికంగా స్వీకరింపజేశారు.ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ అధికారులు సీఎస్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులు సీఎస్‌కు వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

