Thursday, July 30, 2026

Buy now

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ

* ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే అవకాశం కల్పించాలి.. లేదంటే ఉద్యమం: కల్వకుంట్ల కవిత**
* తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశం**

ప్రజానావ,హైదరాబాద్,బంజారాహిల్స్: లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు రాష్ట్రంలోని వేలాది మంది ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ **కల్వకుంట్ల కవిత** ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆమె, వారి సమస్యలను విని ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, అవసరమైతే వారి తరఫున ఉద్యమానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

సమావేశంలో ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఈవీ ఆటోలను ప్రవేశపెడితే తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, దీంతో రోజువారీ ఆదాయం తగ్గి చాలామంది వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత అవసరమైతే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆటోలను వినియోగించుకునే అవకాశం ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం స్వయంగా ఆటో సేవలను నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం జీవనోపాధిగా ఆటోలు నడుపుతున్న వారిని పక్కనబెట్టి కొత్త ఈవీ ఆటోలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టడమేనని విమర్శించారు.

గతంలో ప్రభుత్వం ప్రకటించిన “వన్ స్టేట్–వన్ పర్మిట్” విధానంతో పాటు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆమె గుర్తు చేశారు. మరోవైపు చిన్నచిన్న ఉల్లంఘనల పేరుతో భారీ మొత్తంలో చలాన్లు విధిస్తూ డ్రైవర్లపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవల్లో ప్రస్తుతం రోడ్లపై ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ప్రభుత్వం ఆటో యూనియన్లతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర నగరాల్లో కూడా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఆటో డ్రైవర్ల అభ్యర్థనలను పట్టించుకోకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆటో యూనియన్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈవీ ఆటోలను రోడ్లపైకి రానివ్వబోమని స్పష్టం చేసిన కవిత, రాష్ట్రంలోని అన్ని ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అలాగే చెత్త సేకరణలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఈవీ ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Related Articles

spot_img

Most Popular