* ఎగుమతులకు అనుకూల విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి – రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, తయారీ రంగం, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హస్తకళలు, ఐటీ ఆధారిత సేవలు తదితర రంగాల ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎగుమతుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు తెలంగాణను దేశంలోని ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.సమావేశంలో అధికారులు గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి రూ.1,22,655 కోట్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, వెజిటబుల్ సీడ్స్, ఎర్ర మిర్చి తదితర రంగాల్లో ఎగుమతులను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) అధికారులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.ఈ సమావేశంలో పర్యాటక, సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డా. జి. ముకుంద రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎగుమతుల ప్రోత్సాహక సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

