Friday, August 14, 2026

Buy now

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

* ఆపదలో చిక్కుకుంటే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి*

రామగుండం: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల కారణంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలోని డ్యామ్‌లు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లరాదని సూచించారు. అలాగే చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు లేదా పాడైన నిర్మాణాల వద్ద ఆశ్రయం పొందరాదని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని హెచ్చరించారు.

చెరువులు, నాలాలు, డ్యామ్‌లు, జలపాతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని, చేపల వేట కోసం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.వరదల కారణంగా దెబ్బతిన్న లేదా నీటమునిగిన రహదారుల వద్ద ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, వైద్య శాఖలతో సమన్వయం చేసుకుని బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులు, కుంటలు, అలుగులు, ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వరద నీటి కారణంగా చెరువులు, కుంటల కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని, వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కల్వర్టులు, చిన్న వంతెనలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని సూచించారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. అవసరమైన సమయంలో వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, పోలీసు శాఖ 24 గంటల పాటు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular