Thursday, July 30, 2026

Buy now

అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: మంత్రి సీతక్క

* గత ఏడాదిలో 5,938 కేంద్రాలకు టాయిలెట్లు, 3,815 కేంద్రాలకు తాగునీరు, 14,271 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం
* అన్ని జిల్లాల్లో చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత ఏడాది కాలంలోనే అదనంగా 5,938 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సౌకర్యం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు శాఖ అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.

రాష్ట్ర సచివాలయంలో గురువారం మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. శాఖ కార్యదర్శి శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు, చిన్నారుల పోషకాహారం, పాఠశాల పూర్వ విద్య, దత్తత కేంద్రాలు, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు వంద శాతం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సర్వే ఫలితాల ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు.

చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడేలా బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్న మంత్రి, ప్రతి చిన్నారికి నాణ్యమైన పోషకాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే 16 జిల్లాల్లో నియామకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయని అధికారులు వివరించగా, మిగిలిన జిల్లాల్లో కూడా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

టీచర్లు, ఆయాలకు యూనిఫాంలను అక్టోబర్ తొలి వారంలోగా అందించాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అంగన్వాడీ టీచర్లకు డిప్లొమా సర్టిఫికెట్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులను ఆకర్షించేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని, పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే రంగులతో కేంద్రాలను అభివృద్ధి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా కేంద్రాలను తాత్కాలికంగా మార్చాల్సి వస్తే చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో బాలింతల కోసం ఇప్పటికే 54 ‘తల్లి ఒడి’ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించగా, అవసరమైన అన్ని జిల్లాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్ల ఏర్పాటు వేగవంతం చేసి, దత్తత ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

తెలంగాణను బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి అధికారులకు సూచించారు.అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లాప్స్ కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారులు అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించి సమస్యలపై నివేదికలు సమర్పించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular