హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులను నైపుణ్యాల (స్కిల్స్) వైపు మళ్లించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేందుకు, తెలంగాణను విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ఉపాధ్యాయ ప్రతినిధులతో సీఎం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి మార్గనిర్దేశం చేస్తూ విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై తన దృష్టికోణాన్ని వివరించారు.
12వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థికి ప్రపంచంపై సమగ్ర అవగాహన ఉండేలా తీర్చిదిద్దాలని, అందులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం స్వయంగా పరిష్కరిస్తుందని, వారు అడగకుండానే బదిలీలు, పదోన్నతులు వంటి అంశాలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రపంచ దేశాలు తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఆదర్శంగా చూసే స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన సీఎం, వచ్చే ఐదేళ్లను విద్యా రంగ అభివృద్ధికి అంకితం చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేయాల్సిన కార్యాచరణపై డిసెంబర్ నాటికి నివేదిక సిద్ధం చేయాలని, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా విద్యార్థుల విజయానికి ఎంతో అవసరమని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికే డీఎస్సీ ద్వారా కేవలం 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, 23 వేల మందికి పదోన్నతులు, 30 వేల మందికి పైగా బదిలీలు చేపట్టిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలపై కూడా ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
భవిష్యత్‌లో అమెరికాపై మాత్రమే కాకుండా జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనా వంటి దేశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని, నైపుణ్యాలు మరియు భాషా పరిజ్ఞానం ఉంటే లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు.
సంక్షేమ పథకాలు అవసరమైనవేనని, అయితే విద్య ద్వారా ప్రతి కుటుంబంలో డాక్టర్లు, ఇంజినీర్లు, నైపుణ్యాలున్న యువతను తయారు చేయడం ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని సీఎం అన్నారు. ఆ మార్పును తీసుకురాగల శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 9 శాతం నిధులు కేటాయించామని, రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులపై ఒక్కొక్కరికి సగటున రూ.1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ స్థాయి పెట్టుబడికి తగిన విధంగా నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
గత మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని, ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి పైగా కొత్తగా చేరారని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే తెలంగాణ విద్యా రంగంలో దేశవ్యాప్తంగా మెరుగైన స్థాయికి చేరుకుందని చెప్పారు.
విద్యాశాఖపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి స్పందించిన సీఎం, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా మంత్రి రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు.
సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ ప్రతినిధులు పాల్గొన్నారు.

