Thursday, July 30, 2026

Buy now

పెద్దపల్లి ప్రజల చిరకాల కల సాకారం దిశగా బస్సు డిపో..

* దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి – రవాణా సౌకర్యాలు మరింత మెరుగుదల
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి,ప్రజానవ బ్యూరో: పెద్దపల్లి జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, దసరా నాటికి డిపోను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తో కలిసి పెద్దపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన బస్సు డిపో పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి అధికారులతో పాటు కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన బస్సు డిపోను ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లకు బస్సు డిపోలు ఉన్నప్పటికీ, తొలి నుంచే రెవెన్యూ డివిజన్‌గా ఉన్న పెద్దపల్లికి గత ప్రభుత్వ హయాంలో డిపో ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి*ని కలిసి పెద్దపల్లి ప్రజల ఆకాంక్ష అయిన బస్సు డిపో మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించిన ముఖ్యమంత్రి 2024 డిసెంబర్‌లో పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో బస్సు డిపోను అధికారికంగా మంజూరు చేశారని గుర్తు చేశారు.ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయని, దసరా నాటికి బస్సు డిపోను ప్రారంభించి ప్రజలకు అంకితం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు.

నూతన బస్సు డిపో అందుబాటులోకి రావడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Related Articles

spot_img

Most Popular