పెద్దపల్లి : పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న గీతాంజలి హైస్కూల్లో తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతాభావంతో పాటు ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని కోరుతూ నిర్వహించే ఈ పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. వేడుకల్లో విద్యార్థులు మహంకాళి అమ్మవారి, పోతరాజు వేషధారణలో అలరించి అందరి ప్రశంసలు పొందారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రేపాల రజిత, అకాడమిక్ డైరెక్టర్ శ్రీ రేపాల రోహిత్ సతీమణి, రేపాల వర్షా, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి డప్పు చప్పుళ్ల నడుమ పాఠశాల నుంచి స్థానిక శాంతినగర్ హనుమాన్ దేవాలయం వరకు బోనాల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిచెప్పారు. విద్యార్థుల్లో మన పండుగలు, సంస్కృతి, ఆచారాల పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

