Saturday, August 15, 2026

Buy now

ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు ప్రభుత్వ కుట్ర

* ఎబివిపి ఆధ్వర్యంలో రాస్తారోకో.

పెద్దపల్లి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మారం సందీప్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా రూ.12 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, 4.5 మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని, మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు.
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం వేసే బిక్ష కాదన్నారు. రీయింబర్స్ మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని, నిరసన చేస్తే లాఠీచార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తేమీ కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మార్చుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాల భవనం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మారం సందీప్, ఎస్ఎఫ్ఎస్ రాష్ట్ర కన్వీనర్ ఓమేష్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, నగర కార్యదర్శి అరవింద్, నగర ఉపాధ్యక్షుడు విగ్నేష్, నాయకులు సిద్ధార్థ, శివ, దినేష్, కార్తీక్, శైలజ, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular