నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆస్పత్రిలో త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, మౌలిక వసతులు, వైద్య సేవలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆస్పత్రులపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, పీహెచ్‌సీ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు నియామకాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించామని, సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని తెలిపారు. ఈ నెలాఖరులోగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలను పూర్తి చేసి జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మందులు, డయాగ్నస్టిక్ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

