Saturday, August 15, 2026

Buy now

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అమలు చేయడంలో విఫలమైంది: కేటీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ “జాబ్‌లెస్ క్యాలెండర్”గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు.

ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు పేర్కొంటున్న “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇంజినీర్లను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని, విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఇంజినీర్లను కూడా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించిన కేటీఆర్, ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్లు, ఉద్యోగ హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు.

నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడతామని, యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయని, ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, బీసీ రిజర్వేషన్లు, విద్యా రంగం తదితర అంశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.

Related Articles

spot_img

Most Popular