Saturday, August 15, 2026

Buy now

ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ కల్పించాలి

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* జిల్లాలోని అనాథ పిల్లలను పూర్తిస్థాయిలో గుర్తించాలి
* చదువు మానేసిన పిల్లలను తిరిగి విద్యాభ్యాసానికి చేరువ చేయాలి
* సీసీఐ హోమ్‌లలో పిల్లలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి
* సమీకృత బాలల సంరక్షణ పథకం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

ప్రజానావ,పెద్దపల్లి ప్రతినిధి : జిల్లాలో ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణతో పాటు ప్రభుత్వ పరిరక్షణ సేవలు పూర్తిస్థాయిలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమీకృత బాలల సంరక్షణ పథకం అమలుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనాథ పిల్లలను పూర్తిస్థాయిలో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (సీసీఐ) హోమ్‌లలో ఉన్న పిల్లలకు అవసరమైన వసతులు, సంరక్షణ, భద్రత కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించేలా జిల్లాను మూడు విభాగాలుగా విభజించి పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువు మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి విద్యాభ్యాసంలోకి తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన పిల్లలకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కేంద్రాల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డు పరిధిలోని కేసుల పురోగతి, బాలల గృహాల తనిఖీలు, ఫోస్టర్ కేర్, స్పాన్సర్‌షిప్ పథకాల అమలు, మిస్సింగ్/ఫౌండ్ చిల్డ్రన్ కేసులు, బాలల భద్రత చర్యలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఫీల్డ్ విజిట్లు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అన్ని ఆన్‌లైన్ యాప్‌లలో సమాచారాన్ని ప్రతిరోజూ నవీకరించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో బాలల సంక్షేమ కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular