Saturday, August 15, 2026

Buy now

“సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప” సభకు సర్వం సిద్ధం

* రేపు ఉదయం 10:30 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ
* తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖుల హాజరు
* సామాజిక న్యాయ తెలంగాణ కోసం కవితతో కలిసి 10 వేల మంది ప్రతినిధుల ప్రతిజ్ఞ

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు సభకు తరలివస్తున్నారు.

సభలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల కవితతో కలిసి సుమారు 10 వేల మంది ప్రతినిధులు ప్రతిజ్ఞ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన కార్యాచరణను కవిత ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తామని కవిత ఇప్పటికే ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించే దిశగా పార్టీ ముందుకు సాగుతున్నట్లు పేర్కొంటున్నారు.

సభా ప్రాంగణాన్ని సామాజిక ఉద్యమకారులు, మహనీయుల చిత్రపటాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కాన్షీరాం, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.సామాజిక న్యాయ తెలంగాణ లక్ష్యంతో హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ రక్షణ సేన కార్యాచరణ చేపట్టనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular