* సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో గ్రామ సమస్యలపై సమీక్ష
* తాగునీరు, కాలువల పూడికతీత, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కీలక ఆదేశాలు
* రైతులు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి
సుల్తానాబాద్: మండల సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీడీవో దివ్యదర్శన్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.
సమావేశంలో గ్రామాల సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను విన్న ఆయన, ముఖ్యంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని డీఈ, ఏఈలకు సూచించారు.
రైతులకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందించేందుకు కాలువల పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు. దశాబ్దాలుగా పూడికతో నిండిపోయిన కాలువలను జేసీబీల సహాయంతో శుభ్రం చేసి సుమారు 2,000 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రూ.50 కోట్లతో బాత్రూములు, ప్రహరీ గోడలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని చెప్పారు.
గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కోసం సర్పంచులు లిఖితపూర్వకంగా మండల విద్యాధికారి, ఎంపీడీవోకు ప్రతిపాదనలు అందించాలని, వాటి పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

