* కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం
* అర్హుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ భూముల రక్షణకు ప్రాధాన్యం
* 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశం
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హుల హక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
22ఏ అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించిన మంత్రి, ప్రతి కేసును రికార్డులు, చట్టపరమైన అంశాలు, వాస్తవాల ఆధారంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే 22ఏ భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల హక్కులు–ప్రభుత్వ ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

