* పోలీస్ స్టేషన్ పనితీరు, పెండింగ్ కేసులు, రికార్డులపై సమీక్ష
* అత్యవసర సేవల కోసం డయల్-112పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశం
* రాత్రి పెట్రోలింగ్, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
సిరిసిల్ల: జిల్లా గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో ఈ తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ అమలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా అంశాలను సమీక్షించారు. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన డయల్-112 అత్యవసర సేవలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ డయల్-112ను వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్పందించాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి సమాచారం కలిగి ఉండాలని, ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.
రాత్రి వేళల్లో గ్రామాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అలాగే గంజాయి, డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, యువతకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో సీఐ వెంకటేష్, ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

