Saturday, August 15, 2026

Buy now

విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్‌స్టాప్ పలుకుదాం: ఎస్పీ మహేష్ బి. గితె

* సిరిసిల్లలో విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీ
* సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, విద్యార్థులకు ఎస్పీ సూచన
* మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పిలుపు

సిరిసిల్ల: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్య్ర మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న “సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె మాట్లాడుతూ, సైబర్ మోసాల పట్ల ప్రజలు, విద్యార్థులను అప్రమత్తం చేసి సురక్షితమైన డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.

సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్‌ల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వస్తే వెంటనే “1930” సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే, ముఖ్యంగా గోల్డెన్ అవర్ (మొదటి గంట)లోనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular