Friday, August 7, 2026

Buy now

ఒడిశాలోని నైనీ గని బొగ్గు రవాణాపై సింగరేణి ఉన్నతస్థాయి సమీక్ష

* రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంగా చర్యలు
* వినియోగదారులు, రవాణా ఏజెన్సీలతో సింగరేణి ఉన్నతాధికారుల సమావేశం
* అంగూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో రవాణా సమస్యలపై చర్చ

ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును రైల్వే సైడింగ్‌తో పాటు వినియోగదారులకు లక్ష్యాల మేరకు ప్రతిరోజూ సరఫరా చేయడంపై సింగరేణి ఉన్నతాధికారులు నైనీ గని వద్ద ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో పాటు బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నైనీ గని నుంచి ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుండగా, సమీప విద్యుత్ కేంద్రాలతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. రోజువారీ లక్ష్యాల మేరకు బొగ్గు రవాణా జరిగేలా రవాణా ఏజెన్సీలు, వినియోగదారులు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ గౌతమ్ పోట్రు సూచించారు.

హిందోల్ రైల్వే సైడింగ్, కామాఖ్య నగర్ సైడింగ్ వరకు రైలు మార్గంలో బొగ్గు రవాణా సజావుగా జరిగేందుకు పూర్తి సహకారం అందించాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న కోరారు. దీనికి వినియోగదారులు, రవాణా సంస్థలు సానుకూలంగా స్పందించి రోజువారీ కేటాయింపుల మేరకు బొగ్గు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

బొగ్గు రవాణా మార్గంలో ఎదురవుతున్న సమస్యలపై అంగూల్ జిల్లా కలెక్టర్ ఎం. అబ్దుల్ అక్తర్, జిల్లా ఎస్పీ రాహుల్ జైన్‌తో సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందించాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు.

రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం కార్యాచరణ చేపట్టింది. అంతకుముందు డైరెక్టర్ గౌతమ్ పోట్రు, ఈడీ బి. వెంకన్న నైనీ గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. సమావేశంలో నైనీ ఏరియా జనరల్ మేనేజర్ డి. బైద్యతో పాటు ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular