Saturday, August 15, 2026

Buy now

సరూర్‌నగర్‌లో సామాజిక న్యాయ సంకల్ప సభ: బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం – కల్వకుంట్ల కవిత

హైదరాబాద్,సరూర్‌నగర్: సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా నిర్వహించిన “సామాజిక న్యాయ సంకల్ప సభ”లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.

బీసీల కోసం మాట్లాడితే తనను అగ్రకులానికి చెందిన వ్యక్తిగా విమర్శిస్తున్నారని, అయితే తన పుట్టుక తన చేతిలో లేకపోయినా ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం తన చేతుల్లోనే ఉందని కవిత అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధించే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని స్పష్టం చేశారు.

బీసీలకు చట్టసభల్లో “50 శాతం రిజర్వేషన్లు” కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్రం ఆమోదించాలని, లేనిపక్షంలో “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని వెయ్యి కార్లతో నిర్వహిస్తామని హెచ్చరించారు.

సామాజిక న్యాయం అంటే కొందరి హక్కులు తీసుకోవడం కాదని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమేనని కవిత పేర్కొన్నారు. భారతదేశంలో జరిగిన అనేక ప్రజాస్వామ్య, సామాజిక సంస్కరణలకు అగ్రకులాల్లోని ప్రజాస్వామ్యవాదులే కారణమయ్యారని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు, ఆదివాసీలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు సహా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, ముస్లింలకు హక్కులతో కూడిన రిజర్వేషన్లు, ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సభలో పలు తీర్మానాలు చేశారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులకు భారతరత్న, ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్, ఎస్సీ-ఎస్టీ నిధులను వారి సంక్షేమానికే వినియోగించడం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, మహిళలు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను తీర్మానాల్లో చేర్చారు.

Related Articles

spot_img

Most Popular