Saturday, August 15, 2026

Buy now

జర్మనీలో తెలంగాణ యువ ఫిజియోథెరపిస్టుకు అరుదైన అవకాశం

హైదరాబాద్: తెలంగాణకు చెందిన యువ ఫిజియోథెరపిస్టు “పి. ఐశ్వర్యరాణి” జర్మనీలో నెలకు “రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో” ఉద్యోగం సాధించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సహకారంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆమెకు శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీలు), గనుల శాఖ మంత్రి **డా. జి. వివేక్ వెంకటస్వామి** నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.

విదేశాల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో టామ్‌కామ్‌ను సంప్రదించిన ఐశ్వర్యరాణి, సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్మన్ భాష శిక్షణలో బీ2 స్థాయి వరకు శిక్షణ పూర్తి చేశారు. భాషా నైపుణ్యంతో పాటు ఉద్యోగానికి అవసరమైన అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా ఉద్యోగాన్ని దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణ యువతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విదేశాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు మంచి డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు విదేశీ భాషల శిక్షణ అందిస్తూ యువతను అంతర్జాతీయ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

విద్యార్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. జర్మనీతో పాటు ఇతర దేశాల్లోనూ తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం, ఐశ్వర్యరాణి జర్మనీలో నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో విధుల్లో చేరనున్నారు. అక్కడ అవసరమైన వృత్తిపరమైన శిక్షణ పూర్తిచేసిన అనంతరం ఆమె వేతనం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐఏఎస్ ఐశ్వర్యరాణిని అభినందిస్తూ, టామ్‌కామ్ అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి, విదేశీ భాషల శిక్షణ కార్యక్రమాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టామ్‌కామ్ అధికారులు, ఐశ్వర్యరాణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular