ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. పాఠశాల దుస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించి అవసరమైన వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ కు సూచించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిర తో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల అనంతరం జిల్లా కలెక్టర్ గురువారం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం చొరవ చూపిన ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, వెంటనే నిధులను మంజూరు చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.

