Friday, August 7, 2026

Buy now

రైతులకు సాగునీరు, ఎరువుల కొరత రాకుండా చర్యలు.. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: ప్రభుత్వ విప్ విజయరమణరావు

పెద్దపల్లి: రైతులకు సాగునీరు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు.పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు అవసరానికి మించి యూరియా, డీఏపీ ఎరువులు వినియోగించడం వల్ల భూముల సారవంతత తగ్గిపోతోందని పేర్కొన్నారు. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. సర్పంచులు, వ్యవసాయ అధికారులు రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ, శాస్త్రీయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రైతు వేదికల ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయంపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత యాసంగి సీజన్‌లో యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం అమలు చేయడంతో ఎరువుల వినియోగం క్రమబద్ధీకరించబడిందని, దిగుబడులు కూడా మెరుగుపడ్డాయని చెప్పారు.

ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీకి నీరు క్రమంగా చేరుతోందని, మహారాష్ట్రలోని ప్రాజెక్టులు 80 శాతానికి పైగా నిండాయని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సారెస్పీ కాలువల్లో నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఎస్సారెస్పీ ప్రధాన, ఉప కాలువల్లో వెంటనే బుష్ క్లియరెన్స్ పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

రైతులకు అవసరమైన సేవలు, సలహాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన విజయరమణరావు, గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త “ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్” జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Related Articles

spot_img

Most Popular