Friday, August 14, 2026

Buy now

ఏజెన్సీ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్: ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్‌సీలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. రాష్ట్ర కమిషన్ చైర్మెన్, సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించిన ఆయన, ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ బృందం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత రైతుల సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పోడు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు, గిరిజన, గిరిజనేతర రైతుల సమస్యలతో పాటు అటవీ శాఖ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ట్రాక్టర్ల వినియోగాన్ని నిరోధించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అటవీ చట్టాల్లో ఉన్న నిబంధనలు ఒకలా ఉండగా, అధికారులు అమలు చేస్తున్న విధానం మరోలా ఉందని పేర్కొన్నారు.

సమావేశానికి ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర కమిషన్ బృందానికి వెడ్మ బొజ్జు పటేల్ స్వాగతం పలికి, స్థానిక సమస్యలపై వివరించారు. అనంతరం ఉట్నూర్ హార్టికల్చర్ కేంద్రాన్ని సందర్శించిన కమిషన్ బృందానికి అక్కడ సాగు చేస్తున్న ప్రత్యేక మొక్కలు, వాటి సాగు విధానం, పెట్టుబడులు, లాభాలు, ఎఫ్‌పీఓల పనితీరుపై అధికారులు వివరించారు.

హార్టికల్చర్ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు భవాని రెడ్డి, అడ్వకేట్ సునీల్, ఐటీడీఏ పీవో మంద మరకందు, హార్టికల్చర్ అధికారులు, జైనూర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular