పెద్దపల్లి: సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంతకుముందు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర చేనేత సొసైటీ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తామని చెప్పారు. అలాగే జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న ఆయన.. చేనేత సొసైటీ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు, పద్మశాలి సంఘం భవన నిర్మాణ పనులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక చేనేత సొసైటీ బకాయిల మాఫీ కోసం సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని, తాను కూడా ఇదే కళాశాలలో చదవడం గర్వంగా భావిస్తున్నానని విజయరమణ రావు తెలిపారు. పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొంటూ, కళాశాలను క్రమశిక్షణతో నడుపుతూ మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఓదెల మల్లన్న దేవాలయ చైర్మన్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

