రాజన్న సిరిసిల్ల: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, వ్యసనానికి గురైన బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ సుమన్ రావుకు డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల వినియోగం కోసం క్యారం, చెస్ బోర్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలు కల్పించి, వారు త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
గంజాయి వ్యసనానికి బానిసై ఆ అలవాటు నుంచి బయటపడాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారు పోలీసు శాఖను సంప్రదించాలని ఎస్పీ కోరారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, డీ-అడిక్షన్ సెంటర్‌లో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించి, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో వ్యసనానికి గురైన వారికి అవగాహన కల్పిస్తూ, అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పారు.
గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినా, వ్యసనానికి బానిసై స్వయంగా మానలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసినా వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ (అడ్మిన్) సురేష్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

