హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు.
కృష్ణా, గోదావరి నదులు, రాష్ట్రంలోని చెరువులు జలకళ సంతరించుకోవాలని, వ్యవసాయానికి అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం నిర్వహించనుండగా, యాగం అనంతరం జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

