మంథని: తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి, రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న నిందితుడిని మంథని సీఐ బి.స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ మంథని సీఐ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా తారక రామనగర్‌కు చెందిన వనం రాము(36) గతంలో గ్రామాల్లో తిరుగుతూ తల వెంట్రుకలు సేకరించి విక్రయించేవాడు. కుటుంబ పోషణకు ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య కవితతో పాటు దాసరి రవి, వనం పాపయ్య, వనం నగేష్‌లతో కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని పేర్కొన్నారు.
గస్తీలో పట్టుబడిన నిందితుడు:
ఈ నెల 8న రామగిరి ఎస్సై టి.శ్రీనివాస్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న రామును గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని తనిఖీ చేయడంతో బటన్ కత్తి లభించింది. విచారణలో గతంలో పలు ప్రాంతాల్లో చేసిన చోరీల వివరాలను వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు.
పలు ప్రాంతాల్లో చోరీలు:
కల్వచర్ల, ఓడేడు, ముత్తారం, దొంగతుర్తి, పత్తిపాక, రత్నాపురం, జూలపల్లి తదితర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు.
దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని జగిత్యాలలోని ముత్తూట్ పిన్‌కార్ప్‌లో తాకట్టు పెట్టి, మరికొన్నింటిని నగల దుకాణంలో విక్రయించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన నగదులో కొంత భాగాన్ని సహచరులకు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని కుటుంబ ఖర్చులు, జల్సాలకు వినియోగించినట్లు పేర్కొన్నారు. మరో రూ.2 లక్షలను సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం చెల్లించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, దొంగిలించిన ఆస్తి రికవరీతో పాటు ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ ఎం.రమేష్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ బి.స్వామి, ఎస్సై టి.శ్రీనివాస్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

