హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్లు, నూతన పింఛన్లు, సంక్షేమ పథకాలు, రహదారులు, సాగు-తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతులపై సమీక్షించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజల అవసరాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాధాన్యతా పనులను విజయరమణారావు సమావేశంలో వివరించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

