పెద్దపల్లి : కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం గా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యాడ్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతం రాజీవ్ రహదారి పై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్, రైతు సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చిందని వాటిని వెంటనే రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి గతంలో ఇచ్చే నిధులను తగ్గించి అందులో యంత్రాలతో పని చేయించుకోవచ్చు అనే నిబంధనలు తేవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపశమనంగా ఉన్న 100 రోజుల పని నిర్వీర్యం అవుతుందని అన్నారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో రైతులకు, గృహజ్యోతి వినియోగదారులకు తదితర పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత కరెంటును రద్దు చేసే దుర్మార్గమైన 2025 విద్యుత్తు సవరణ చట్టం తెచ్చారని అన్నారు. రైతులకు నష్టం చేస్తూ కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త నిబంధనలతో విదేశాల నుంచి ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నారని అన్నారు. దీనితో ఇక్కడ పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని, వీటితో పేద, సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా కార్మికులు,రైతులు, వ్యవసాయ కూలీలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు జి జ్యోతి సీపెల్లి రవీందర్, తాండ్ర అంజయ్య, ఎండి ఖాజా, జిల్లా కమిటీ సభ్యులు రామలక్ష్మి, లచ్చయ్య, నాయకులు రాజమల్లు, భారతి, శ్రీనివాస్, నాగయ్య, దొడ్ల రాజబాబు, నరేష్, రమేష్, రామస్వామి, అంబాల లక్మన్, ఐఎఫ్టియు నాయకులు అశోక్,రాజేశం, తిరుపతి, లింగమూర్తి, బాలకృష్ణ, సృజన్ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

