Friday, August 14, 2026

Buy now

ఆర్థిక ఆరోపణలపై మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు
* ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ

పెద్దపల్లి : జిల్లా లోని మంథని నియోజకవర్గం, మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.ఎన్. జయ ప్రకాశ్‌పై వచ్చిన ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆగస్టు 7న మంథని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కె.ఎన్. జయ ప్రకాశ్‌పై పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, విధుల పట్ల అంకితభావం లోపించడం, ప్రభుత్వ ఉద్యోగికి తగని ప్రవర్తన వంటి అంశాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా) నిబంధనలు, 1964లోని రూల్ 3(1), 3(2) నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 20 ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (CCA) రూల్స్, 1991లోని రూల్ 8(1) ప్రకారం కె.ఎన్. జయ ప్రకాశ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కాలంలో జీవనాధార భత్యంతో పాటు డి.ఏ, ఇతర పరిహార భత్యాలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular