Friday, August 14, 2026

Buy now

జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అతిపెద్ద పరిశోధన కేంద్రం

* అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ
* స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్: గ్లోబల్‌ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ యామ్జెన్ (Amgen) హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్‌ ఎంఓయూ కుదుర్చుకుంది.

అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబుతో యామ్జెన్‌ ఇండియా ప్రతినిధులు సమావేశమై హైదరాబాద్‌ కేంద్రంగా సంస్థ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. అనంతరం యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న పరిశోధన కేంద్రం ద్వారా స్థానిక ప్రతిభావంతులకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇటీవల యామ్జెన్‌ 3 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (GCC) ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఔషధ రంగంలోని దిగ్గజ సంస్థలు తెలంగాణపై విశ్వాసం వ్యక్తం చేయడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని శ్రీధర్‌బాబు అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు తెలంగాణ కీలక వేదికగా మారడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు చెందిన యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యామ్జెన్‌ యాజమాన్యానికి సూచించారు.

* లైఫ్‌ సైన్సెస్‌కు కీలక గమ్యస్థానంగా తెలంగాణ

నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, జీనోమ్‌ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్‌ కారణంగా తెలంగాణ ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు.

దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్‌ క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్‌ఫ్లమేషన్‌, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సల అభివృద్ధిపై పనిచేస్తోంది.

ఎంఓయూ కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ సర్వేశ్‌ సింగ్, యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, ఈడీ శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular