Friday, August 14, 2026

Buy now

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

* 15–30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి
* జిల్లా మానిటరింగ్‌ కమిటీల్లో రైతులకు భాగస్వామ్యం కల్పించాలి
* కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని సరళీకృతం చేయాలి
* సీసీఐ అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌: 2026–27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో సీసీఐ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌ ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని మంత్రి అన్నారు. ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘మనం బతకాలంటే రైతు బతకాలి’’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పనిచేయాలని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రైతులకు కనీస మద్దతు ధర (MSP) అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంట కోతకు సుమారు రెండు నెలల ముందుగానే కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రకృతిపై ఆధారపడి పత్తి సాగు చేసే రాష్ట్ర రైతుల్లో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నందున వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

* మధ్యవర్తుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దు

పత్తి కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. గత సీజన్లలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం గుర్తించిన లోపాలు, అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈ సీజన్‌లో అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

2026–27 సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు, దాదాపు 25.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. లాంగ్‌ స్టేపుల్‌ కాటన్‌కు కేంద్రం క్వింటాల్‌కు రూ.8,667 MSP ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 పెరిగిందని చెప్పారు. ప్రతి అర్హత కలిగిన రైతుకు MSP ప్రయోజనం అందేలా చూడాలని, MSP కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి రాకూడదని ఆదేశించారు.

* 356 జిన్నింగ్‌ మిల్లులు.. 131 CCI కేంద్రాలు

రాష్ట్రంలోని 356 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసి కొనుగోళ్లకు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. L1 నుంచి L12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని అన్నారు.

గత సీజన్‌లో 122 CCI కొనుగోలు కేంద్రాలు ఉండగా, ఈ సీజన్‌లో వాటి సంఖ్యను 131కి పెంచినట్లు మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన మేరకు అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

జిన్నింగ్‌ మిల్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంబంధిత గ్రామాలు, మండలాలను సమీపంలోని నోటిఫైడ్‌ మిల్లుకు అనుసంధానం చేసి రైతులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడాలని ఆదేశించారు.

* జిల్లా కమిటీల్లో రైతులకు చోటు

ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కమిటీల్లో రైతుల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల వద్ద పత్తి రాకను క్రమబద్ధీకరించాలని, అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు సమయాన్ని పొడిగించాలని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.

* కపాస్‌ కిసాన్‌ యాప్‌ సరళీకరణ

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్లు ఓపెన్‌ చేసే ముందు జిల్లా కలెక్టర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారులకు సమాచారం అందించి రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని మరింత సరళీకృతం చేసి, అవసరానికి అనుగుణంగా ఒక రైతు లేదా మొబైల్‌ నంబర్‌కు మల్టిపుల్‌ బార్‌కోడ్‌ సౌకర్యం కల్పించాలని అన్నారు.

పంట బుకింగ్‌ డేటాను NIC ద్వారా కపాస్‌ కిసాన్‌ యాప్‌కు వేగంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సగటు దిగుబడిని ప్రకటించి, దానికంటే అధిక దిగుబడి పొందిన రైతులకు AEOల ద్వారా డిజిటల్‌ యీల్డ్‌ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని సూచించారు.

* నాణ్యత పరీక్షలు తప్పనిసరి

పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని నోటిఫైడ్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో Staple Length, Micronaire, తేమశాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో CCTVలు పనిచేసేలా చూడాలని, బరువు కొలిచే యంత్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.

* రైతుల ఫిర్యాదులకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌

రైతులకు MSPపై పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రైతు నేస్తం, గ్రామస్థాయి కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా MSP, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్‌ బుకింగ్‌ విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్,88972 81111 వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను రైతులు వినియోగించుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ హెల్ప్‌డెస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేదా పెండింగ్‌ ఏర్పడినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు, CCI, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

రైతుకు MSP అందించడమే ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే చర్యలు, అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతుకు MSP ప్రయోజనం అందేలా అన్ని శాఖలు, రాష్ట్ర–జిల్లా స్థాయి కమిటీలు, CCI అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular