* ఆర్‌అండ్‌బీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పెద్దపీట
* ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి: ఈనెల 17న పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని పలు ఆర్‌అండ్‌బీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాల ఏర్పాట్లను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మంగళవారం సుల్తానాబాద్ పట్టణం, మండలంలోని గర్రెపల్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాలను అనుసంధానిస్తూ రూ.99 కోట్ల వ్యయంతో గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు నిర్మించనున్న తారు రోడ్డుకు గర్రెపల్లి గ్రామంలో మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు విజయరమణారావు తెలిపారు.
అనంతరం సుల్తానాబాద్ నుంచి పెద్దపూర్ వరకు రూ.42 కోట్లతో నిర్మించనున్న రహదారికి సుల్తానాబాద్ పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం సుల్తానాబాద్‌లోనే బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
* పలు రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు:
కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి మండలాల్లో పలు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు గంగారం–పందిళ్ల, కూనవరం చౌరస్తా–ముత్తారం రహదారుల అభివృద్ధి పనులకు కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విజయరమణారావు అన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

