ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ఇందిరమ్మ రాజ్యంతోనే గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం గోపాల్‌పేట మండలం కర్ణమాయకుంట తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన భవనం ద్వారా తండా ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో కర్ణమాయకుంట తండాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

