Friday, August 14, 2026

Buy now

యువశక్తితోనే దేశ ప్రగతి.. విద్యార్థుల్లో దేశభక్తి పెంచాలి

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
* 10 వేల మంది విద్యార్థులతో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

పెద్దపల్లి : యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు అన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ జెండా ర్యాలీని ఆయన ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తిరంగా యాత్రలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని విద్యార్థులు కదం తొక్కగా, ర్యాలీ దేశభక్తి నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగా వంటి కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ, సేవా భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్‌ ఉందని, యువత ప్రతిభను సరైన మార్గంలో వినియోగించుకుంటే దేశం అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగుతుందని రాంచందర్‌రావు తెలిపారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు విద్యా రంగంలోనూ అనేక సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలు, యూనివర్సిటీలను విస్తరిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, గోమాస శ్రీనివాస్, గొట్టిముక్కల సురేష్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, చందుపట్ల సునీల్‌రెడ్డి, బల్మురి వనిత, మీస అర్జున్‌రావు, కందుల సంధ్యారాణి, చల్ల నారాయణరెడ్డి, పెంజర్ల రాకేష్, కావేటి రాజగోపాల్, ఊషణ అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular