ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రజల అప్రమత్తతే అత్యంత కీలకమని సైబర్ క్రైమ్ ఎస్సై రవిప్రకాష్ పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్, రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవిప్రకాష్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సైబర్ భద్రతలో భాగస్వామి కావాలని, తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తెలియని లింకులు, ఫోన్ కాల్స్, క్యూఆర్ కోడ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీ, పిన్ నంబర్లను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్, వాకర్స్ క్లబ్ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.

