Friday, August 14, 2026

Buy now

అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

* జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లి : మరణం తర్వాత కూడా తోటి వారికి ప్రాణదానం చేసే గొప్ప అవకాశం నేత్రదానం, అవయవదానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సదాశయ ఫౌండేషన్, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో గురువారం పట్టణ మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి జిల్లా కోర్టు ఆవరణలో నేత్రదానం, అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హాజరై మాట్లాడుతూ నేత్రదానం, శరీర అవయవాల దానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల గ్రామం నేత్రదానంలో ఆదర్శంగా నిలవడం అభినందనీయం అన్నారు. గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు నేత్రదానం చేయాలనే నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకున్న ఆ గ్రామస్తుల ఐకమత్యం అందరికీ ఆదర్శమని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భీష్మాచారి కృషిని ఆమె కొనియాడారు. నేత్రదానం అంటే కళ్ళు మొత్తం తీసేస్తారనే అపోహ చాలామందిలో ఉందని, కానీ, అది వాస్తవం కాదని, కేవలం అవసరమైన రెటీనా చిన్న పొరను మాత్రమే తీసుకుంటారని, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె స్పష్టం చేశారు. అనారోగ్యంతో పాటు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను సేకరించడం ద్వారా మరో కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని, మరణానంతరం కూడా మనం జీవించే ఉండడానికి ఇదొక ఉత్తమ మార్గమని ఆమె వివరించారు. అవయవ దానానికి మనం సిద్ధపడాలంటే, ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలిని, సరైన ఆహారపు అలవాట్లతో జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ, జీవనశైలిని క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి,ఆయన సతీమణి రమాదేవి తమ శరీరాలను దానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని, వారు సమాజానికి నిలువెత్తు నిదర్శనమని, ఆ దంపతులిద్దరిని శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా నేత్రదానాన్ని మరింతగా ప్రోత్సహించాలని, దీనికి బార్ అసోసియేషన్ సభ్యులందరూ పూర్తి సహకారం అందించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచం స్వప్న రాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వంగర భవాని, జూనియర్ సివిల్ జడ్జి ఎన్. మంజుల, డీసీపీ భూక్య రామ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్,ఎస్ఐ కే. నరేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశం, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణ్ కుమార్ భీష్మాచారి, పలువురు న్యాయవాదులు, సదాశయ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular