# సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల నిరసన
సిరిసిల్ల: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.10,814 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని, విద్యాసంస్థల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో అందక విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు విద్యాసంస్థల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు.

