Friday, August 14, 2026

Buy now

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

# అర్హులందరికీ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందిస్తాం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్: మహిళల ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.

హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సమీపంలోని అమిత్ గార్డెన్స్‌లో గురువారం ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్‌కు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందిస్తామని అన్నారు.

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన, విద్యా, సామాజిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము, 55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు, PACS చైర్మన్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు విసం సురేందర్ రెడ్డి, వెంకన్న, కనుపర్తి కిరణ్, రవి యాదవ్ తో పాటు నాయకులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular