Friday, August 14, 2026

Buy now

ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

# అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తాం: ఎమ్మెల్యే

గోదావరిఖని: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన నూతన అంబులెన్స్‌ను గురువారం రామగుండం ఎమ్మెల్యే **ఎం.ఎస్. రాజ్ ఠాకూర్** ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి నూతన అంబులెన్స్ అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సేవలు ఎంతో కీలకమని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, అత్యవసర సేవలను మెరుగుపరిచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తామని అన్నారు.

నూతన అంబులెన్స్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులకు వేగంగా సేవలు అందించడంతో పాటు, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సందర్భాల్లో ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్‌ను నడిపి సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, ఆస్పత్రి అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎన్‌టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular