# గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచులు
కాల్వ శ్రీరాంపూర్: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రాంతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మండలంలోని గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను సర్పంచులు ప్రభుత్వ విప్ విజయ రమణారావు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి, సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ వాటిని పరిష్కరించాలని ప్రభుత్వ విప్ సూచించారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చారని విమర్శించారు. త్వరలోనే ఆ ఆసుపత్రిని తిరిగి 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే మండలంలో 108 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
రాబోయే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. మొక్కజొన్నల కొనుగోలు సమయంలో రైతులకు రావాల్సిన గన్నీ సంచుల డబ్బులను త్వరలోనే వారి ఖాతాల్లో జమ చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

