◆ ఎరువుల ధరల పెంపుతో సామాన్యులపై భారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దింపాల్సిందే!
◆ లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులకు భంగం.. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ధ్వజం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’ శుక్రవారంతో ముగిసింది. రేవల్లి మండలం తలుపునూరు, తలుపునూరు తండాల్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు కృష్ణవేణి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు జయమ్మ నేరుగా పొలాల్లోకి దిగి రైతుకూలీలతో కలిసి వరి నాట్లు వేశారు.
రూ.1000 లోపు ఉన్న డీఏపీ బస్తా ధరను మోదీ ప్రభుత్వం రూ.2,300కు పెంచి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. గోపాల్‌పేటలో జరిగిన ముగింపు కార్యక్రమంలో సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారని, లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులను కాలరాశారని విమర్శించారు. మోదీ పాలనకు స్వస్తి చెప్పేందుకు పేదలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, వెంకటమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

