ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : కేటీదొడ్డి, గట్టు మండలాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ, రూ. 1,781 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుతో గద్వాల నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందని, నియోజకవర్గం సస్యశ్యామలం కానుందని పేర్కొన్నారు. నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు ఎమ్మెల్యే రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

