Friday, August 14, 2026

Buy now

సిరిసిల్ల జిల్లాలో ఎరువులకు కొరత లేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

# రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల: జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఎరువుల సరఫరా, నిల్వలు, విక్రయాలపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో పాటు మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌, సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిపై కలెక్టర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన ఎరువులను జిల్లాలోనే తగినంతగా నిల్వ ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను రైతులకు విక్రయించాలని సూచించారు. ఎరువుల కొరత, అధిక ధరల విక్రయాలకు ఆస్కారం లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు.

ఈ సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, మార్క్‌ఫెడ్‌ డీఎం హబీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular