Friday, August 14, 2026

Buy now

ఆపదలో ధైర్యసాహసాలు.. బాలిక ప్రాణాలు కాపాడిన యువకులకు సన్మానం

# గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌ అభినందనలు

గోదావరిఖని: ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి నీటిలో మునిగిపోతున్న బాలికను రక్షించిన బోయినిపేటకు చెందిన అంకం శేఖర్‌, ఆకుల అరవింద్‌లను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌ అభినందించి సన్మానించారు.

మంథని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొక్కలవాగు వద్ద బోయినిపేటకు చెందిన పర్శవేన రాజు తన కుమార్తె అలేఖ్యతో కలిసి గొర్రెల మందను వాగు దాటించే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో జారిపడ్డాడు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అలేఖ్య కూడా నీటిలో మునిగిపోతూ కేకలు వేసింది.

అదే సమయంలో అటుగా వెళ్తున్న అంకం శేఖర్‌ వెంటనే స్పందించి నీటిలోకి దిగి అలేఖ్యను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోవడంతో శేఖర్‌, ఆకుల అరవింద్‌ కలిసి ప్రథమ చికిత్స అందించి ఆమెను స్పృహలోకి తీసుకువచ్చారు.

అనంతరం అలేఖ్య తన తండ్రి కూడా నీటిలో మునిగిపోయినట్లు చెప్పడంతో శేఖర్‌, అరవింద్‌ మరోసారి వాగులోకి దిగి రాజును బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి బాలికను కాపాడటంతో పాటు ఆమె తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన శేఖర్‌, అరవింద్‌ల ధైర్యసాహసాలను ఏసీపీ ఎం. రమేష్‌ అభినందించారు. ఏసీపీ కార్యాలయంలో మంథని సీఐ బుద్ధె స్వామి, ఎస్‌ఐ సాగర్‌ సమక్షంలో వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు సమయస్ఫూర్తితో స్పందించడం అభినందనీయమని ఏసీపీ పేర్కొన్నారు. శేఖర్‌, అరవింద్‌ చూపిన ధైర్యసాహసాలు, మానవత్వంతో స్పందించిన తీరు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

Related Articles

spot_img

Most Popular