Friday, August 14, 2026

Buy now

సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు ప్రారంభం కావాల్సిందే

# ఆగస్టు చివరి నాటికి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి.. నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి శ్రీధర్‌బాబు
# గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ మొదటి వారంలో పుష్కర పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టెండర్‌ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన ‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని తెలిపారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్‌-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని మంత్రి స్పష్టం చేశారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పనుల పురోగతిని రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమని మంత్రి పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రహదారులను పరస్పరం అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా రోడ్డు కనెక్టివిటీ లోపాలు ఉంటే వెంటనే గుర్తించి, అవసరమైన పనులను స్థానిక నిధులతో చేపట్టాలని సూచించారు.

పుష్కర ఏర్పాట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని శ్రీధర్‌బాబు తెలిపారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలను ముందుగానే గుర్తించి వారి సేవలను సమన్వయం చేయాలని సూచించారు.

కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

spot_img

Most Popular