Tuesday, August 25, 2026

Buy now

తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లివ్వాలి

* నాలుగేళ్ల స్థానికత నిబంధనతో ఇతర రాష్ట్రాల వాళ్లకే లబ్ధి
* జీవో 150ను రద్దు చేయాలి
* తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ :తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నీట్ ర్యాంకులు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కవితతో భేటీ అయ్యారు. ప్రభుత్వం 2024 లో తీసుకువచ్చిన 150 జీవో కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తున్నాయని.. ఫలితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతోందని వివరించారు.

కవిత స్పందిస్తూ, వారం రోజుల్లో ఎంబీబీఎస్ సీట్లు అలకేట్ చేసే అవకాశ ఉండటంతో ప్రభుత్వం తెలంగాణ స్థానిక విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్య సంవత్సరం నాటికి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నం.150ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తెచ్చిన అనాలోచిత జీవోతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రెండేళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తించేలా జీవో నం.150 తేవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతోన్న విద్యార్థులకే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కుతున్నాయని తెలిపారు.

ఏటా సుమారు 1,500ల నుంచి 2 వేల సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకే దక్కుతున్నాయని, ఆమేరకు తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడేళ్లు ఏ రాష్ట్రంలో జరిగితే అక్కడ స్థానికత వర్తించేలా పాత జీవోను పునరుద్ధరించాలని సూచించారు.

నీట్ కారణంగా ఇప్పటికే 15 శాతం సీట్లు కోల్పోతున్నామని, ఏ రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి ఆ రాష్ట్రమే ఎంట్రన్స్ నిర్వహిస్తే సీట్లు కోల్పోవాల్సిన ఆస్కారమే ఉండదన్నారు. విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ అంశం అత్యంత సెన్సిటివ్ అని.. ప్రభుత్వం వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ విద్యార్థులకు మళ్లీ అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈమేరకు చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Related Articles

spot_img

Most Popular