Tuesday, August 25, 2026

Buy now

22ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

* ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
* 22ఏ దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి
* తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమమైతే కఠిన చర్యలు
* నకిలీ జీఓలు, బోగస్ మెమోలు, ఫేక్ సర్టిఫికెట్లతో భూదందాలపై క్రిమినల్ కేసులు
* యుఎల్‌సీపై త్వరలో విధానపరమైన నిర్ణయం
* మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, వివిధ కేటగిరీల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలను రికార్డులతో ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు.

సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 22ఏ పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు 22ఏకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. నిజమైన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎంత భూమి ఉందో రికార్డులతో వివరిస్తాం

22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎంత భూమి ఉంది, ఎందుకు నిషేధిత జాబితాలో ఉంది, ఎవరి భూమి, ఏ కారణంతో చేర్చారనే ప్రతి అంశాన్ని రికార్డులతో ప్రజల ముందుంచుతామని తెలిపారు.

ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటమే 22ఏ ప్రధాన ఉద్దేశమన్నారు. అదే సమయంలో న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు 22ఏ

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు జరిగాయని, అలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టడం తప్పా? అని ప్రశ్నించారు.

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి దారాదత్తం చేసిన వ్యవహారాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.

జూబ్లీహిల్స్‌లో రికార్డుల సవరణ

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్ పేర్కొనడంతో ముఖ్యమంత్రి నివాసంతో పాటు తన నివాసం కూడా పీఓబీలో చేరిందని, దీనిని గుర్తించిన వెంటనే సరిచేశామని వివరించారు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తే చర్యలు

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172 ప్రభుత్వ భూమి కాగా, 173 ప్రైవేట్ భూమిగా ఉందని మంత్రి తెలిపారు. 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ భూమిని కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ హ్యామ్లెట్‌కు ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడంతో భూ వివాదాలు తలెత్తాయని చెప్పారు. సర్వే నంబర్లను సక్రమంగా పునర్వ్యవస్థీకరించి, సమగ్ర సర్వే ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

నకిలీ పత్రాలతో భూదందాలు

ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీఓలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వ్యవహారాలను గుర్తించామని మంత్రి తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

మేడ్చల్ జిల్లాలో 22-04-2026 తేదీతో జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్లు చూపిస్తూ నకిలీ మెమోను, మరోచోట 02-06-2026 తేదీతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించి రిజిస్ట్రేషన్ కోరిన ఘటనలను గుర్తించామని చెప్పారు.

యుఎల్‌సీపై త్వరలో విధాన నిర్ణయం

రాష్ట్రంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ)కు సంబంధించి త్వరలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో యుఎల్‌సీ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యలను వివరించారు.

యుఎల్‌సీ క్లియర్ చేసుకున్న భూములకు సంబంధించిన జీఓలు, ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. యుఎల్‌సీకి దరఖాస్తు చేయని లేదా క్లియరెన్స్ పొందని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనన్నారు.

CS-7, CS-14పై దర్యాప్తుకు సిద్ధం

గత ప్రభుత్వ హయాంలో CS-7, CS-14కు సంబంధించిన భూ వ్యవహారాల్లో 2017లో 811 ఎకరాల భూమిని ఐదు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం కోరితే సెట్ దర్యాప్తునకు ఆదేశిస్తామని మంత్రి తెలిపారు.

1,162 కాల్స్.. 980 ప్రత్యేక ఫిర్యాదులు

22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి తెలిపారు. రిపీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు.

వాటిలో 547 వ్యవసాయ భూములకు, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవని తెలిపారు. రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్ నుంచి 149, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 44, యాదాద్రి భువనగిరి నుంచి 40, సిద్దిపేట నుంచి 35 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

రిజిస్ట్రేషన్ కాని వారికి సొమ్ము తిరిగి

ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22ఏ కేసుల్లో సుమారు 98 శాతం స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. 300కు పైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12–13 కేసులను మాత్రమే తిరస్కరించినట్లు చెప్పారు.రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి ఈ వారాంతంలోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

ప్రజలను భయపెట్టడం ప్రభుత్వ విధానం కాదు

“ప్రజలను భయపెట్టడం మా ప్రభుత్వ విధానం కాదు.. ప్రజలకు భరోసా కల్పించడం మా బాధ్యత. ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో, న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, ప్రతి రికార్డును ధృవీకరిస్తామని తెలిపారు. “తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమం జరిగితే చర్యలు తీసుకుంటాం. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం అనుమతించదు” అని మంత్రి పేర్కొన్నారు.

సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular