* రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు
పెద్దపల్లి : తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందరరావు చేపట్టిన 48గంటల నిరాహారదీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లాకేంద్రంలో భారీ రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని హెచ్చరించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని పేర్కొనడం రేవంతరెడ్డి దురహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు బిజెపి అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
శ్రేణుల రాస్తారోకో వలన రాజీవ్ రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసనలో జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్, సౌదరి మహేందర్ యాదవ్, కాసగోని నిర్మల, బెజ్జంకి దిలీప్ కుమార్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, శివంగారి సతీష్, భూతగడ్డ రాజకుమార్, రామగిరి అఖిల్, పెంజర్ల రాకేష్ యాదవ్, వేల్పుల రమేష్, కారెంగుల శ్రీనివాస్, బిజెవైఎం మండల అధ్యక్షులు రెండ్ల వేణు, తీగల అశోక్, కొల్లూరి సంతోష్, గుడ్ల సతీష్, రాజేందర్ రెడ్డి, ఉమేష్, పెంచాల సంతోష్,దాత రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

